కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు సిగ్గుతో తలదించుకోవాలి :కేంద్ర మంత్రి బండి సంజయ్ 

కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు సిగ్గుతో తలదించుకోవాలి :కేంద్ర మంత్రి బండి సంజయ్ 
  •   ఫిరాయింపు రాజకీయాలకు సుప్రీం తీర్పు చెంపపెట్టు

హైదరాబాద్, వెలుగు: అవకాశవాద, అధికార రాజకీయాల కోసం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు సిగ్గుతో తలదించుకోవాలని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఫిరాయింపు రాజకీయాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆ పార్టీలకు గట్టి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా సిగ్గుపడాల్సింది పోయి, ఇప్పటికీ ఎవరికి వారే తమ విజయంగా భావిస్తూ ప్రగల్భాలు పలుకుతారా అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయారాం, గయారాం.. ఆ తర్వాత మళ్లీ సొంత గూటికి చేరడం.. ఇదేనా మీ రాజకీయ సంస్కృతి అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీ కండువా కప్పుకోవడాన్ని ఏమనాలని నిలదీశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొన్ని మీడియా సంస్థలు కావాలనే వక్రీకరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఖైరతాబాద్ అనర్హత కేసులో అసలు వాస్తవాలు ఏమిటో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని కోరారు. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం అనివార్యమని బండి సంజయ్ తేల్చిచెప్పారు. అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే కనీస అర్హత, నైతిక హక్కు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు లేవని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఈ రెండు పార్టీలను రాబోయే రోజుల్లో  నిమజ్జనం చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.